: అతిపెద్ద ఉల్కాపాతం... ఆగస్టు 12న కనువిందు చేయనున్న నక్షత్ర వాన!

రాత్రిపూట ఆరుబయట పడుకుని ఆకాశంలోకి చూస్తున్న వేళ, ఎక్కడి నుంచో ఓ నక్షత్రం రాలిపోయినట్టు కనిపిస్తుంది. దాన్ని చూసిన తరువాత కళ్లు మూసుకుని ఏదైనా కోరిక కోరుకుంటే తీరుతుందని కూడా నమ్ముతుంటాం. అది నక్షత్రం కాదని, అంతరిక్షంలో పరిభ్రమించే అసంఖ్యాక ఉల్కల్లో ఒకటి భూ వాతావరణంలోకి వచ్చి మండి రాలిపోయిందన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఒక ఉల్క రాలితేనే దాన్ని అద్భుతంగా వీక్షిస్తాం. అటువంటిది కొన్ని వందలు, వేలు ఒకేసారి రాలితే... ఎంత అద్భుతంగా ఉంటుందా నక్షత్ర వాన. మానవ చరిత్రలో అతిపెద్ద ఉల్కాపాతం ఆగస్టు 12, 13 తేదీల్లో కనిపించనుంది.

వాస్తవంగా ఉల్కాపాతం ప్రతియేటా జూలై రెండో వారం నుంచి మొదలై దాదాపు నాలుగు వారాల పాటు ఉంటుంది. ఈ సంవత్సరం ఉల్కాపాతం మునుపటికన్నా ఎక్కువగా ఉంటుందని నాసా ఉల్కల అధ్యయన విభాగం నిపుణుడు బిల్ కూకీ వ్యాఖ్యానించారు. ఆగస్టు 12న అర్థరాత్రి ఒంటి గంటకు (ఈడీటీ - ఈస్ట్రన్ డేలైట్ టైమ్) గరిష్ట ఉల్కా పాతాన్ని చూడవచ్చని ఆయన అన్నారు. గంటకు 150 నుంచి 200 వరకూ ఉల్కలు భూమిని తాకనున్నాయని తెలిపారు. రెండు రోజులూ అర్థరాత్రి ఉల్కలు రాలడాన్ని చూడవచ్చని తెలిపారు.

అయితే, ఆ సమయం పౌర్ణమికి దగ్గరగా ఉండటంతో, చంద్రుడు పూర్తి స్థాయి ప్రకాశంతో వెండి వెన్నెలను కురిపిస్తూ ఉండటంతో ఉల్కలు రాలుతున్నా అవి స్పష్టంగా కనిపించక అసంతృప్తి కలుగుతుందని అన్నారు. కాగా, ఈ ఉల్కాపాతం ఉత్తర హెమీస్పీయర్ ప్రాంతం నుంచి స్పష్టంగా కనిపిస్తుందని, అక్కడి నుంచి మధ్య దక్షిణ ప్రాంతాలవైపు వెళ్లేకొద్దీ ఉల్కాపాతాన్ని చూడవచ్చని ఆయన తెలిపారు. ప్రపంచంలోని మిగతా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఉల్కాపాతం స్వల్పంగానైనా కనిపిస్తుందని అన్నారు. కూర్చుని ఓపికగా చూస్తే, కనువిందైన ఉల్కాపాతాన్ని దర్శించవచ్చని తెలిపారు.

More Telugu News