: టెస్టుల్లో స్పిన్నర్ హ్యాట్రిక్ కోసం 78 ఏళ్లు నిరీక్షించిన ఇంగ్లండ్... ఆ రికార్డు మోయిన్ అలీ ఖాతాలోకి

టెస్టుల్లో ఓ స్పిన్ బౌలర్ హ్యాట్రిక్ నమోదు చేయడానికి 78 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న ఇంగ్లండ్ కల నెరవేరింది. ప్రతిష్ఠాత్మక ఓవల్ మైదానంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 239 పరుగుల తేడాతో విజయం సాధించగా, మోయిన్ అలీ చివరి మూడు వికెట్లనూ వరుస బంతుల్లో పడగొట్టి హ్యాట్రిక్ చేశాడు.

1938లో జొహానస్ బర్గ్ లో ఇదే సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతున్న వేళ అప్పటి స్పిన్నర్ టామ్ గొగార్డ్ హ్యాట్రిక్ నమోదు చేయగా, ఆపై మరే స్పిన్ బౌలర్ కూడా టెస్టుల్లో హ్యాట్రిక్ తీయలేదు. ఒవెల్ లో 100వ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ హ్యాట్రిక్ తీయడం తమ దేశ క్రికెట్ చరిత్రలో మరపురాని రోజని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటివరకూ 13 మంది ఇంగ్లండ్ బౌలర్లు అన్ని హ్యాట్రిక్ లు సాధించారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు సార్లు ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో నాలుగు మ్యాచ్ ల సీరిస్ లో ఇంగ్లండ్ 2-1తో ముందుండగా, నాలుగో టెస్టు శుక్రవారం నుంచి మాంచెస్టర్ లో జరగనుంది.

More Telugu News