: నంద్యాలలో కాపు, బలిజల ఓట్లు 30 వేలు... పవన్ మద్దతు కోరనున్న చంద్రబాబు!

మూడేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పవన్ ప్రచారం టీడీపీకి అధికారంలోకి రావడానికి కలిసొచ్చింది కూడా. ఆ తరువాత జరిగిన పరిణామాలు తెలుగుదేశం పార్టీకి పవన్ ను కాస్తంత దూరం చేశాయనే చెప్పవచ్చు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత నంద్యాల ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలని భావిస్తూ సర్వశక్తులూ ఒడ్డుతున్న టీడీపీ, నియోజకవర్గంలో నిర్ణయాత్మకమైన కాపు, బలిజల ఓట్లపై కన్నేసింది. నంద్యాల సెగ్మెంట్ లో 30 వేల వరకూ ఈ వర్గం ప్రజల ఓట్లు ఉన్నాయి. వీటితో పాటు యువ ఓటర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది.

పవన్ కల్యాణ్ మద్దతిస్తే, కాపు, బలిజ వర్గం ఓట్లు అధిక మొత్తంలో పడతాయని భావిస్తున్న చంద్రబాబు, ఈ మధ్యాహ్నం పవన్ తో సమావేశమైన వేళ ఆయన మద్దతు కోరవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, మూడేళ్ల నాడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన రాజకీయాల్లో చురుకుగా లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ పార్టీ జిల్లా స్థాయిలో బలోపేతమైంది కూడా. ఈ నేపథ్యంలో జనసేన తరపున అభ్యర్థిని బరిలోకి దింపుతారా? లేకుంటే టీడీపీకి మద్దతు పలుకుతారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా పవన్ నోటి నుంచి ఇంకా బయటకు రాలేదు. మరోవైపు వైసీపీ కూడా పవన్ మద్దతు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం.

More Telugu News