: నవంబర్లో హైదరాబాద్ కు రానున్న ఇవాంకా ట్రంప్!

హైదరాబాద్ లో జరిగే ఓ అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొంటారని తెలిసింది. నవంబర్ లో హైటెక్స్ లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆమె ప్రత్యేక అతిథిగా వచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఈ సదస్సును నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా, దేశ విదేశాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు సదస్సుకు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు.

ఇక నవంబర్ లో సదస్సు జరగనుండటంతో ఏర్పాట్లపై పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులతో సమీక్షించి, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. వర్షాలు పడితే, అతిథులు ప్రయాణించే మార్గాల్లో డ్రైనేజీలు పొంగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గెస్టులు బస చేసే హోటళ్ల నుంచి హైటెక్స్ కు దారితీసే మార్గాలన్నీ అలంకరించాలని, రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్, అన్వర్ ఉలాం కాలేజ్, శ్రీనగర్ కాలేజ్ జంక్షన్, జూబ్లీ చెక్ పోస్టు, కేబీఆర్ పార్కు, హైటెక్ సిటీ, మాదాపూర్ జంక్షన్లను మరోసారి పరిశీలించి మరమ్మతులు ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. పాడైపోయిన ఫుట్ పాత్ లను వెంటనే బాగు చేయాలని, రోడ్లపై గుంతలు ఉండరాదని కూడా ఆదేశించారు.

More Telugu News