: ప్రజలు నా వైఫల్యాలను లెక్కించారు.. కానీ నేను లెక్క చేయలేదు!: విరాట్ కోహ్లీ

శ్రీలంకపై తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన అనంతరం కెప్టెన్ కోహ్లీ తనలోని ఆవేదనను వెళ్లగక్కాడు. ప్రజలు తన వైఫల్యాలను లెక్కగట్టారని, అయినా తాను వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనపై చెలరేగిన విమర్శలను గుర్తు చేసుకుని కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాను ప్రజల దృష్టి కోణం నుంచి చూడనని పేర్కొన్నాడు. తనకు తెలిసి స్టాండ్స్ బయట కూర్చున్నవారు తాను ఎన్ని ఇన్నింగ్స్‌లలో చెత్తగా ఆడానన్న దానిని లెక్కగడుతుంటారని, అయితే అప్పటి పరిస్థితుల్లో జట్టుకు ఏది కావాలో అది ఇవ్వడమే ఆటగాడి లక్ష్యమని తేల్చి చెప్పాడు.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభినవ్ ముకుంద్‌తో కలిసి సమయోచితంగా ఆడిన కోహ్లీ సెంచరీ చేశాడు. 58 టెస్టులు ఆడిన కోహ్లీకి ఇది 17వ సెంచరీ. తానైతే ఎన్ని ఇన్నింగ్స్‌లలో పరుగులు చేయలేకపోయానన్న విషయాన్ని పట్టించుకోనని, అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నప్పుడు ఏ ఫార్మాట్‌లో, ఏ ఇన్నింగ్స్‌లో స్కోరు చేయలేదన్న విషయం అప్రస్తుతమన్నాడు. అయితే జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినప్పుడు మాత్రం ఆ ఆనందం వేరుగా ఉంటుందన్నాడు. బ్యాట్స్‌మెన్ ఎలా ఆడాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పాల్సిన అవసరం లేదని, అది వారికి తెలుసని కోహ్లీ హితవు పలికాడు.

More Telugu News