: ముఖ్యమంత్రిగారూ.. మీకో వెయ్యి రూపాయిలిస్తా.. నా కుమార్తెకు స్కూల్ అడ్మిషన్ ఇప్పించరూ!.. కేజ్రీవాల్‌కు ఓ తల్లి లేఖ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ తల్లి రాసిన లేఖ విద్యావ్యవస్థ తీరును ప్రశ్నిస్తోంది. తన కుమార్తెను స్కూల్లో చేర్పించడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె చివరికి ముఖ్యమంత్రికే లేఖ రాసింది. ‘కావాలంటే ఓ రూ.1000 ఇస్తా.. నా కుమార్తెకు మాత్రం స్కూల్లో సీటు ఇప్పించండి’ అని లేఖ రాసి తన ఆవేదనను వ్యక్తం చేసిందా తల్లి.

ఢిల్లీలోని చిల్లాఖదర్ వాసులు తమ తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఇబ్బందులు పడుతుండడంతో అందరూ కలిసి సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న పాఠశాలలు ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు లేవన్న కారణంతో తమ పిల్లల్ని స్కూళ్లలో చేర్చుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తమ పిల్లలకు చదువు చెప్పించాలని వేడుకున్నారు. తన కుమార్తెకు చదువు చెప్పమని కొన్ని నెలలుగా వేడుకుంటున్నానని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఓ తల్లి లేఖలో పేర్కొంది. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, తనకు చదువు చెప్పిస్తే తానైనా జీవితంలో ఎదుగుతుందని అందులో పేర్కొనడం పలువురితో కన్నీరు పెట్టించింది. ఈ లేఖలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని భావిస్తున్నట్టు చిల్లాఖదర్ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News