: అద్దంకి బాధ్యతలు గొట్టిపాటికే... కరణం బలరాంను పక్కనబెట్టిన చంద్రబాబు!

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటైన అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం, వైకాపా టికెట్ పై గెలిచి, ఆపై టీడీపీలో చేరిన గొట్టిపాటి రవికుమార్ ల మధ్య విభేదాలు పెరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాను అద్దంకి బాధ్యతలను గొట్టిపాటికి అప్పగించిన తరువాత కూడా, మరొకరు జోక్యం చేసుకోవడం ఏంటని మండిపడ్డ ఆయన, తానిప్పటికే పలుమార్లు ఈ విషయంలో హెచ్చరించానని, గొట్టిపాటి రవికుమార్ తప్ప మరెవరైనా పార్టీ వ్యవహారాల్లో తలదూర్చితే, క్రమశిక్షణా చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో అద్దంకిలో జరుగుతున్న ఘటనల గురించి ప్రస్తావనకు రాగా, అసహనాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు, కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సమయంలోనే అసెంబ్లీ నియోజకవర్గంలో తల దూర్చే ప్రయత్నాలు వద్దని తాను స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. సీనియర్ కాబట్టే బలరాంకు గుర్తింపు నిచ్చామని, నియోజకవర్గాలు పెరిగితే ఆయన కుమారుడికి టికెట్ గ్యారెంటీగా ఇస్తానని కూడా అన్నానని చెప్పిన చంద్రబాబు, ఇంత స్పష్టంగా తాను చెబుతున్నా కరణం బలరాం నియోజకవర్గంలో పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని అన్నారు.

More Telugu News