: బీహార్‌కు ప్రత్యేక హోదా?.. రెండు దశాబ్దాల తర్వాత కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వాలు.. ప్రజల్లో చిగురిస్తున్న ఆశ!

రెండు రోజుల క్రితం వరకు సాఫీగా సాగిన బీహార్ రాజకీయాలు సీఎం నితీశ్ కుమార్ రాజీనామాతో ఒక్కసారిగా మారిపోయాయి. దేశ రాజకీయాల్లో నితీశ్ రాజీనామా ప్రకంపనలు సృష్టించింది. బీహార్‌లో భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీలో గుబులు రేపింది. బీజేపీ అండతో నితీశ్ తిరిగి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నట్టు అయింది.

కేంద్రంలో ఇప్పుడు అనుకూల ప్రభుత్వం ఉండడంతో బీహార్ వాసుల ఆశలు మళ్లీ మొగ్గతొడుగుతున్నాయి. తమకు ప్రత్యేక హోదా వస్తుందని ఆశ పడుతున్నారు. ప్రత్యేక హోదా రాకున్నా ఆ మేరకు నిధులు సంపాదించుకోవడం ఇప్పుడు నితీశ్‌కు పెద్ద కష్టం కాబోదని చెబుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న తమ చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం అసరమైతే ఏ కూటమికైనా మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని 2014 ఎన్నికల్లోనే నితీశ్ ప్రకటించారు. అప్పటికే బీజేపీతో వైరం ఉన్నా.. ప్రత్యేక హోదా ఇస్తామంటే తిరిగి కలుస్తామని పేర్కొని నితీశ్ సంచలనం సృష్టించారు.

2015లో బీహార్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ రూ.1.25 లక్షల కోట్లతో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. అయినప్పటికీ మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని గత రెండున్నరేళ్లుగా నితీశ్ గుర్తు చేస్తూనే ఉన్నారు. బీహార్ అభివృద్ధికి నిధులు చాలా అవసరమని ప్రతి సందర్భంలోనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అయితే తాజాగా రాజకీయ సమీకరణలు మారి జేడీయూ ఇప్పుడు ఎన్డీఏ పక్షమైంది. బీహార్‌లోనూ, కేంద్రంలోనూ ఒకే కూటమి ప్రభుత్వాలు ఉండడం 1998 తర్వాత ఇదే తొలిసారి. కాగా, తాజా పరిణామం బీహార్ అభివృద్ధికి దోహదపడుతుందని, కేంద్రం నుంచి నిధుల రాకకు ఇక ఎటువంటి సమస్యలు ఉండవని ప్రజలు ఆశగా ఉన్నారు.

More Telugu News