: తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు.. ఏపీకి ఆనందీ బెన్.. తెలంగాణకు శంకరమూర్తి!

తెలుగు రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఉన్న ఒక్క గవర్నర్ స్థానంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, శాసనమండలి చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌లను గవర్నర్‌గా నియమించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.  

ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ పదవీకాలం ఈ మార్చితోనే పూర్తైనా, కొత్త గవర్నర్లను నియమించే వరకు పదవిలో కొనసాగాలని కేంద్రం సూచించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించాలని యోచిస్తున్న కేంద్రం ఈ విషయాన్ని నూతన రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరైన కేసీఆర్, చంద్రబాబుకు చూచాయగా చెప్పినట్టు సమాచారం. ఉమ్మడి గవర్నర్ అవసరం లేదని భావిస్తున్న కేంద్రం చట్ట సవరణతో పనిలేకుండా కార్యనిర్వాహక ఆదేశాల ద్వారానే ఆ పని పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News