: నితీశ్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ... కారణమిదే!

బీజేపీ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా, బీహార్ లో మహా ఘటబంధన్ విచ్ఛిన్నం కాగా, కొత్త పొత్తులు, మారిన సమీకరణాలు నితీశ్ ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. ఆర్జేడీని వదిలి బీజేపీతో చేతులు కలిపి, 6వ సారి ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరవుతారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పాత మిత్రుడు మధ్యలో విడిపోయి, తిరిగి కలుస్తున్న వేళ, మోదీ వచ్చి ఆయన్ను అభినందిస్తారని, అమిత్ షా తదితర పెద్దలు కూడా వస్తారని బీహార్ బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరు కాలేదు.

దీనికి కారణం, నేడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండో వర్థంతి. ఈ సందర్భంగా రామేశ్వరంలో ఆయన స్మారక భవానాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి వుంది. ఈ కార్యక్రమం నెల రోజుల కిందటే షెడ్యూల్ లో చేరిపోయింది. రామేశ్వరం వెళ్లాల్సి వచ్చినందునే మోదీ, పాట్నాకు రాలేకపోయారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త, అబ్దుల్ కలాంకు గౌరవాన్నివ్వకుంటే విమర్శలు వస్తాయని భావించిన మోదీ, రామేశ్వరం వెళ్లేందుకే నిర్ణయించుకున్నారని, నితీశ్ ను ఫోన్ లో అభినందించారని బీజేపీ నేతలు వెల్లడించారు. కాగా, ఈ ఉదయం రామేశ్వరం చేరుకున్న మోదీ, అక్కడ నిర్మించిన స్మారక మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామేశ్వరం - అయోధ్య (ఫైజాబాద్) రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు వారానికి ఒకసారి తిరగనుంది.

More Telugu News