: మమ్మల్ని కాదని నితీశ్‌ను ఎలా ఆహ్వానిస్తారు.. గవర్నర్ తీరుపై తేజశ్వి యాదవ్ ఫైర్.. కోర్టుకెళ్తామన్న లాలు తనయుడు!

బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నితీశ్ కుమార్‌ను గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠీ ఆహ్వానించడంపై ఆర్జేడీ మండిపడింది. అత్యధిక స్థానాలున్న తమను కాదని జేడీయూను ఎలా ఆహ్వానిస్తారని లాలూ తనయుడు తేజశ్వియాదవ్ ప్రశ్నించారు. నితీశ్‌ను ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్టు గవర్నర్ తమతో చెప్పారని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చలేమని పేర్కొన్నారని ఆయన తెలిపారు. గవర్నర్ తీరుపై తాము కోర్టుకు వెళ్తామన్నారు.

తేజశ్వి యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్‌లు ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. బయటకు వచ్చిన అనంతరం తేజశ్వి మాట్లాడుతూ.. శరద్ యాదవ్‌ను జేడీయూ చీఫ్‌ పదవి నుంచి తొలగించినప్పటి నుంచే కుట్ర మొదలైందన్నారు. నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేసి శాసనసభలో తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరామన్నారు. అయితే గవర్నర్ అందుకు నిరాకరించారన్నారు. తమ నిరసన తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని, నితీశ్ దిష్టిబొమ్మలు తగలబెడతామని తేజశ్వియాదవ్ తెలిపారు.

More Telugu News