: చైనాకు షాక్ ఇచ్చిన శ్రీలంక.. భారత్ కు తప్పిన పెను ప్రమాదం!

భారత్ పై దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. శ్రీలంకలోని హంబన్ తోటలో ఓడరేవును నిర్మించేందుకు చైనా సిద్ధమైన సంగతి తెలిసిందే. తద్వారా, భారత్ పక్కలోనే మరో కీలక స్థావరం ఏర్పాటు చేసుకునే పన్నాగంలో డ్రాగన్ కంట్రీ ఉంది. అంతేకాదు... హిందూ మహాసముద్రంలో జరిగే జలరవాణాకు ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. ఈ ఓడరేవు ద్వారా ఈ ప్రాంతంపై పెత్తనం సాగించే దిశగా చైనా అడుగులు వేస్తుండటంపై భారత్ తో పాటు అమెరికా, జపాన్ లు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. తమకు భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయని... ఓడరేవును నిర్మించే ఒప్పందాన్ని మరోసారి పున:పరిశీలించుకోవాలని శ్రీలంకపై ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు, శ్రీలంక ప్రజల నుంచి కూడా చైనా ఓడరేవుపై ఆ దేశ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంది. చైనా ఓడ రేవుతో తమ దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని శ్రీలంక దేశస్తులు భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘె నేతృత్వంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో శ్రీలంక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓడరేవుపై చైనాకు ఉండే విస్తృతమైన అధికారాలకు కత్తెర వేసింది. దీంతో, భారత్ కు భద్రత పరమైన పెను ముప్పు తప్పినట్టైంది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో చైనా ఈ పోర్టును నిర్మించనుంది. ఈ పోర్టుపై వచ్చే ఆదాయంలో 80 శాతం వాటాను చైనాకు ఇచ్చేందుకు శ్రీలంక అంగీకరించింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.  

More Telugu News