Shruti Hassan: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

*  సినిమా జయాపజయాలపై అందాలతార శ్రుతి హాసన్ తాజాగా స్పందించింది. "సినిమా హిట్టయితే, ఆ క్రెడిట్ ను అందరూ కొట్టేస్తారు. అదే ఫ్లాపయిందనుకోండి.. ఒక్కోసారి ఆ పరాజయాన్ని కథానాయికకు అంటగట్టేస్తారు. ఇదెక్కడి న్యాయమో నాకు తెలియదు. సినిమా సమష్టి కృషి కదా? అలా కథానాయికను నిందించడం సబబేనా?" అంటూ అమ్మడు నిలదీస్తోంది.      
*  నందమూరి బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'పైసా వసూల్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, త్వరలో నిర్వహించే ఈ చిత్రం ఆడియో వేడుకలో బాలకృష్ణ ఇప్పటివరకు నటించిన 100  సినిమాల విశేషాలతో కూడిన ఒక వీడియో కర్టెన్ రైజర్ ను విడుదల చేయనున్నారు.
*  ప్రస్తుతం రామ చరణ్ తో 'రంగస్థలం' చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ మరోపక్క తన బ్యానర్ పై 'దర్శకుడు' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేస్తున్నారు. కాగా, ఈ నెల 29న హైదరాబాదులో నిర్వహించే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నట్టు సుకుమార్ తెలిపాడు.
*  నారా రోహిత్, చైతన్య దంతులూరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'బాణం' సినిమా విమర్శకుల నుంచి సైతం మంచి ప్రశంసలు అందుకుంది. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

More Telugu News