: డ్రైవర్‌ రహిత కార్లపై భారత్ సంచలన నిర్ణయం.. వాటిని దేశంలోకి అనుమతించేది లేదని ప్రకటన!

డ్రైవర్ రహిత (సెల్ఫ్ డ్రైవింగ్) కార్లను దేశంలోకి అనుమతించేది లేదని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉన్నప్పుడు వాటిని ఎలా అనుమతిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన తిరిగి ప్రశ్నించారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల వేలాదిమంది డ్రైవర్లు నిరుద్యోగులయ్యే అవకాశం ఉందన్నారు. డ్రైవర్ లెస్ కార్లకు అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ ఓకే చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, కాంగ్రెస్ నిర్ణయంతో వేలాది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్లకెక్కనున్నాయి. సెర్చింజన్ దిగ్గజం గూగుల్, టెక్నాలజీ దిగ్గజం ఆపిల్, రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబెర్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఉత్పత్తిలో బిజీగా ఉన్నాయి.

ఎలక్ట్రానిక్ వాహనాల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని గడ్కరీ తేల్చి చెప్పారు. పర్యావరణ హిత, కాలుష్య రహిత ప్రజా రవాణా కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. రోడ్లమీదికి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దేశంలో ఏడాదికో జాతీయ రహదారి నిర్మించాల్సి వస్తుందని మంత్రి వివరించారు. కాబట్టి ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. అందుకోసం విద్యుత్, ఇథనాల్, బయో-డీజిల్, బయోగ్యాస్,, ఎల్ఎన్‌జీ తదితర వాటితో నడిచే బస్సులను ప్రవేశపెడతామన్నారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 240 కిలోమీటర్లు ప్రయాణించేలా వాహనాలను అభివృద్ధి చేయాలని మంత్రి గడ్కరీ తయారీదారులకు సూచించారు.

More Telugu News