: సిట్ విచారణపై... హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ ఛార్మి

డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిట్ పంపించిన నోటీసులపై హీరోయిన్ ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉదయం ఆమె లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా తన నుంచి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించవద్దంటూ పిటిషన్ లో కోరింది. రక్త నమూనాల సేకరణ సరికాదని పిటిషన్ లో తెలిపింది. సిట్ విచారణకు తనతో పాటు లాయర్ ను కూడా తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని పిటిషన్ లో ఆమె కోర్టును కోరింది.

సిట్ విచారణ తీరు సరిగా లేదంటూ ఛార్మి ఆరోపించింది. తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేకున్నప్పటికీ, నోటీసులు జారీ చేశారని... ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించింది. సిట్ వ్యవహారం తన పరువుకు భంగం కలిగించేలా ఉందని చెప్పింది. ఈ నెల 26వ తేదీన ఆమె సిట్ విచారణను ఎదుర్కోబోతోంది. మరోవైపు, ఛార్మిని ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించకుండా, ఆమె నివాసానికే వెళ్లి విచారించే అవకాశాలున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

More Telugu News