: గల్ఫ్ దేశాలకు తగ్గిన భారతీయుల వలస.. ఆర్థిక మందగమనమే కారణం!

విదేశాలకు వలస వెళ్లాలనుకునే భారతీయ కార్మికులకు మూడు నాలుగేళ్ల క్రితం వరకు గల్ఫ్ దేశాలే తొలి ప్రాధాన్యంగా నిలిచేవి. దేశంలో ఏ మూల ఉన్న వారైనా తొలుత గల్ఫ్ దేశాలనే ఎంచుకునే వారు. అయితే గత రెండేళ్లుగా గల్ఫ్ వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లోని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మందగించడంతో అటువైపు వెళ్లేందుకు భారతీయులు అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

2014లో 7,75,845 మంది భారతీయ కార్మికులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లగా 2016లో ఆ సంఖ్య ఏకంగా 5,07,296కు పడిపోయింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుండడం, ఈ ప్రాంతంలో అస్థిరత పెరగడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఇక భారతీయ కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లడం తగ్గిపోవడంతో ఆయా దేశాల నుంచి భారత్‌కు వచ్చే సొమ్ము కూడా తగ్గిపోయింది.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం. 2014-15లో ఆయా దేశాల నుంచి 69,819 మిలియన్ డాలర్లు భారత్‌కు రాగా, 2015-16లో ఆ మొత్తం 65,592  మిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఏకంగా 50 శాతానికి పడిపోయింది. చమురు ధరలు పడిపోతుండడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోంది. దీనికి తోడు విదేశీయుల కంటే సౌదీలకే ఉద్యోగావకాశాలు కల్పించాలన్న అక్కడి ప్రభుత్వ విధానాల వల్ల కూడా భారతీయులు ఆ దేశం వైపు చూడడం మానేశారు.

More Telugu News