: టైటిల్ పోరులో తుది వరకు పోరాడి... కేవలం 9 పరుగుల తేడాతో ఓడిన భారత మహిళా జట్టు!

ఎంతో ఊరించిన టైటిల్ వేటలో భారత మహిళా క్రికెట్ జట్టు చివరిమెట్టుపై చతికిలపడింది. కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్ లో మహిళా క్రికెట్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు వరల్డ్ కప్ విజయం ఎంతో దోహదపడుతుందని, తమ ఆటతీరు, ప్రతిభపై ఉన్న అనుమానాలన్నిటినీ పటాపంచలు చేయడానికి వరల్డ్ కప్ ను తీసుకురావడమే మార్గమని భావించిన మహిళా క్రికెట్ జట్టు ప్రయత్నాలను ఇంగ్లండ్ మహిళా జట్టు బౌలర్ ష్రబ్ సోల్ అద్భుత స్పెల్ నీరుగార్చింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టును భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ప్రధానంగా టాప్ పేసర్ జులన్ గోస్వామి అద్భుతమైన బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్ వుమన్ ను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. ఆమెకు స్పిన్నర్లు కూడా సహకరించడంతో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు సాధించకుండా నిరోధించగలిగారు. సైబర్ ఎల్బీ (51) అర్ధసెంచరీతో రాణించగా, సారా టేలర్ (41), బ్రంట్ (34), గన్ (25), విన్ ఫీల్డ్ (24), బీ మౌంట్ (23) ఆకట్టుకునేలా ఆడడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగిపోయింది. ఓపెనర్ పూనమ్‌ రౌత్‌ (86) అద్భుతంగా ఆడి విజయంపై ఆశలు రేపింది. అయితే మరో ఓపెనర్ స్మృతి మంధన మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరింది. అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్ (17) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ జట్టులో విజయంపై ధీమా పెరిగింది. అనంతరం హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (51) మరోసారి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని అర్థ సెంచరీ చేసింది.

ఈ దశలో వేదకృష్ణమూర్తి (35) ఒంటిరిగా పోరాడింది. సహచరులు సుష్మా వర్మ దారుణంగా విఫలం కాగా, దీప్తి శర్మ (14) కాసేపు పోరాడింది. జులన్‌ గోస్వామి (0), శిఖా పాండే (4), రాజేశ్వరి గైక్వాడ్ (1) నిరాశపర్చగా, పూనమ్‌ యాదవ్‌ (1) నాటౌట్ గా నిలిచింది. దీంతో భారత జట్టు 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ విధంగా కేవలం 9 పరుగుల దూరంలో టైటిల్ కు భారత మహిళా క్రికెట్ జట్టు తన పోరాటం ముగించింది. భారత బ్యాట్స్ వుమన్ ను బెంబేలెత్తిస్తూ ఇంగ్లండ్ బౌలర్ ష్రబ్‌ సోల్‌ 6 వికెట్లతో అద్భత ప్రదర్శన చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు నాలుగో సారి వరల్డ్ కప్ ను సగర్వంగా తలకెత్తుకుంది.

More Telugu News