: శనివారంలోగా పూరీ జగన్నాథ్ అరెస్ట్?

దర్శకుడు పూరీ జగన్నాథ్ ను శనివారంలోగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు మొత్తం ఇప్పటివరకూ పూరీ చుట్టే తిరుగుతూ ఉండటం, ఇతరులకు పంపిణీ చేశాడనటానికి పక్కాగా ఆధారాలు లభించడమే ఆయన అరెస్ట్ కు దారితీయనుందని తెలుస్తోంది. ఇక పూరీ స్వయంగా డ్రగ్స్ తీసుకుంటాడని అనుమానిస్తున్న సిట్, ఇప్పటికే, రక్తం, వెంట్రుకలు తదితర నమూనాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సంగతి తెలిసిందే. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పూరీ డ్రగ్స్ వాడుతున్నట్టు వెల్లడైతే, ఈ కేసులో అది బలమైన సాక్ష్యంగా మారుతుందని సిట్ భావిస్తోంది.

పూరీ జగన్నాథ్ తెప్పించే డ్రగ్స్ ను తనతో పాటు చార్మీ, ముమైత్ ఖాన్ లకు ఇచ్చేవాడని సుబ్బరాజు స్వయంగా వెల్లడించడంతో ఇక అరెస్ట్ తప్పదని సమాచారం. కాగా, పూరీ జగన్నాథ్ ను విచారించిన రోజే, కేసులో ముఖ్యమైన వ్యక్తి అతనేనని, అరెస్ట్ జరుగుతుందని వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందనుకున్న విచారణ రాత్రి 9 గంటల వరకూ సాగింది. అప్పుడే పూరీని అరెస్ట్ చేస్తారని భావించినా, ఆ రోజుకు ఆయన్ను విడిచిపెట్టారు సిట్ అధికారులు. తాము కేవలం ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసమే ఎదురు చూస్తున్నామని, ఆ నివేదిక రాగానే సినీ ప్రముఖుల అరెస్ట్ ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

More Telugu News