: ఖైరతాబాద్ గణేశుడికి మహా లడ్డూ లేనట్టే... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన లడ్డూతోనే సరి!

హైదరాబాద్ లో వినాయక చవితి పేరు చెబితే, మొట్టమొదటగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ లో కొలువుతీరే భారీ గణేశుడేననడంలో సందేహం లేదు. ఇక ఖైరతాబాద్ గణేశుడి చేతిలో కనిపించే మహా లడ్డూ ప్రసాదం కూడా అంతే విశిష్టతను సంతరించుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరానికి చెందిన సురుచి స్వీట్స్ యజమాని పీవీవీఎస్ మల్లికార్జునరావు నేతృత్వంలోని టీమ్ దాదాపు నెల రోజుల పాటు శ్రమించి ఈ భారీ లడ్డూను తయారు చేస్తుంది. గణేశ్ నిమజ్జనం రోజు వరకూ వినాయకుడి చేతిలో ఉండే ఈ లడ్డూను ప్రసాదంగా అందుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు.

ఇక ఈ సంవత్సరం మాత్రం గణేశుని చేతిలో లడ్డూ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లడ్డూను భక్తులకు పంపిణీ చేసే రోజున వస్తున్న సమస్యల కారణంగా ఒరిజినల్ లడ్డూను స్వామి ఎడమ చేతిలో నిలిపే విషయాన్ని పునరాలోచిస్తున్నట్టు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. లడ్డూ స్థానంలో బరువు తక్కువగా ఉండే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన లడ్డూను నిలిపే అవకాశాలు ఉన్నాయని కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటర్ ఎస్ రాజ్ కుమార్ వెల్లడించారు.

కాగా, 2010 నుంచి మల్లికార్జునరావు ఈ లడ్డూను అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. 2015లో 6 వేల కిలోల లడ్డూను తయారు చేసి వినాయకుడికి కానుకగా అందించారు. ఇందుకోసం 2,600 కిలోల పంచదార, 1,500 కిలోల నూనె, 1,500 కిలోల శనగపప్పు, 200 కిలోల బాదంపప్పు, 200 కిలోల జీడిపప్పు, 30 కిలోల లవంగాలు వాడారు. ఈ మహా ప్రసాదం పంపిణీ సమస్య లా అండ్ ఆర్డర్ సమస్యగా మారింది. భక్తులపై లాఠీచార్జ్ చేయాల్సి రాగా, పోలీసుల వైఖరిపై విమర్శలూ చెలరేగాయి. ఈ లడ్డూ కోసం ముందు రోజు రాత్రి నుంచే భక్తులు క్యూ కట్టడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఇక గత సంవత్సరం లడ్డూ పరిమాణాన్ని తగ్గించి 500 కిలోల లడ్డూను మాత్రమే స్వామి చేతిలో ఉంచారు. ఈ సంవత్సరం అది కూడా ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

More Telugu News