: వచ్చేసింది... గోదావరి తీరాన పులసల సీజన్... కిలో రూ. 5 వేలు!

పుస్తెలమ్ముకునైనా పులస తినాలనేది ఉభయ గోదావరి జిల్లాల్లో పేరున్న సామెత. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య గోదావరికి వరదలు వస్తే, ఎర్ర నీటి మట్టిని తిని పెరుగుతూ, సముద్రం నుంచి ఎదురు ఈదుతూ ధవళేశ్వరం బ్యారేజీ వరకూ వచ్చే ఈ పులస చేపల సీజన్ మొదలైంది. ఇటీవలి వర్షాలకు గోదావరిలో వరద నీరు ప్రవహిస్తుండగా, ధవళేశ్వరం, ఆత్రేయపురం, వద్దిపర్రు, బొబ్బర్లంక, సిద్ధాంతం తదితర ప్రాంతాల్లో ఈ చేపలు లభిస్తున్నాయి.

ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రవహించే గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ నదుల్లో పులస చేపల కోసం మత్స్యకారులు తీవ్రంగా శ్రమిస్తుండగా, కిలో చేప ఖరీదు, అది లభించే ప్రాంతాన్ని బట్టి రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకూ పలుకుతోంది. ఈ రకం చేపలకు ఉన్న డిమాండ్ కారణంగా ఆన్ లైన్ లో కూడా విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే, కొందరు గోదావరి పులస పోలికతో ఉండే చేపలను ఒడిశా నుంచి తెచ్చి అమ్ముతున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా లభించే పులస చేపల పొలుసులపై ఎర్రజార ఉంటుందని, కొనే ముందు దాన్ని చూసి కొనుక్కోవాలని మత్స్యకారులు సలహా ఇస్తున్నారు.

More Telugu News