: ‘సూపర్‌ ఫాస్ట్’ పేరుతో రూ.11 కోట్లు బాదేస్తున్న రైల్వే.. ఆ రైళ్లు మాత్రం వెరీ స్లో!

‘సూపర్ ఫాస్ట్’ పేరుతో రైల్వే ప్రయాణికులను అడ్డంగా బాదేస్తున్న ఉత్తర మధ్య రైల్వే (ఎన్‌సీఆర్), దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)లు ఏకంగా 11.17 కోట్లు పిండుకుంటున్నాయి. అయితే ఆయా రైళ్లు మాత్రం ఏనాడూ నిర్ణీత సమయానికి గమ్యానికి చేరుకోకపోవడం విశేషం. సర్ చార్జీల పేరుతో వసూలు చేస్తున్న రైళ్లలో ఏకంగా 95 శాతం ఆలస్యంగా నడుస్తున్నాయని ‘కాగ్’ వెల్లడించడం రైల్వేల తీరుకు అద్దం పడుతోంది.

రైల్వే బోర్డు ప్రకారం సూపర్ ఫాస్ట్ కేటగిరీ లోని రైళ్లు సగటున 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఆ వేగాన్ని అవి ఎప్పుడో తప్ప అందుకోలేకపోతున్నాయి. 2013-14, 2015-16 మధ్య ఎన్‌సీఆర్, ఎస్‌సీఆర్ పరిధిలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఆయా రైళ్ల లేటు 13.48 శాతం, 95.17 శాతం రోజుల్లో లేటుగా నడుస్తున్నాయని తేలింది.  21 సూపర్ ఫాస్ట్ రైళ్లు మొత్తం 16,804 రోజుల్లో 3వేల రోజులు ఆలస్యంగా నడిచినట్టు వెల్లడైంది. దీనికి కారణం నిర్ణీత వేగాన్ని అవి అందుకోలేకపోవడమేనని కాగ్ రిపోర్టు పేర్కొంది. అయితే రైలు ఆలస్యమైతే డబ్బులు వెనక్కి ఇచ్చే విధానం ప్రస్తుతం రైల్వేలో లేదని తెలిపింది. రైలు మూడు గంటలకు మించి ఆలస్యమైతేనే డబ్బులు వెనక్కి వస్తాయని వివరించింది. సూపర్ ఫాస్ట్ రైళ్లలో సర్‌చార్జీలు తరగతులను బట్టి రూ.15 నుంచి రూ.75 వరకు వసూలు చేస్తున్నారు.

More Telugu News