: ఇంకా మిస్టరీగానే అదృశ్యమైన ఆ 39 మంది ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు!

ఆశలు అడుగంటిపోతున్నాయి. ఇరాక్‌లోని మోసుల్‌లో మూడేళ్ల క్రితం అదృశ్యమైన 39 మంది నిర్మాణరంగ కార్మికుల ఆచూకీ మిస్టరీగా మారింది. వారెక్కడున్నారో తెలియక కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. వారు బతికే ఉన్నారని, మోసుల్ సమీపంలోని బాదుష్ జైల్లో వారు ఉండొచ్చని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గతవారం బాధిత కుటుంబ సభ్యులతో పేర్కొన్నారు. వారిని తిరిగి క్షేమంగా తీసుకొచ్చి అప్పజెబుతామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడక్కడ జైలే లేదని, పూర్తిగా శిథిలమైందని బాదుష్ మీడియా పేర్కొనడంతో ఉన్న ఒకే ఒక్క ఆశ సన్నగిల్లింది.

కాగా, ఇరాక్ సేనలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను  మోసుల్ నుంచి వెళ్లగొట్టిన వెంటనే భారత ప్రభుత్వం కేంద్రమంత్రి వీకేసింగ్‌ను ఎర్బిల్ పంపింది. అదృశ్యమైన భారతీయుల కోసం ఇరాక్ అధికారులతో సమావేశమయ్యారు. అయితే తాజాగా బాదిష్‌లో జైలు లేదన్న వార్తలపై స్పందించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖ నిరాకరించింది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ చెర నుంచి తప్పించుకున్న హర్జిత్ మాషీ మాట్లాడుతూ 39 మంది భారతీయులను ఎప్పుడో చంపేశారని పేర్కొనడం కలకలం రేపుతోంది. అయితే సుష్మాస్వరాజ్ ఆయన వ్యాఖ్యలను కొట్టిపడేశారు.

More Telugu News