: సిట్ అధికారులపై నమ్మకం ఉంది.. కేసీఆర్ పైనే డౌట్: పొంగులేటి

డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దర్యాప్తును తాము ప్రశ్నించడం లేదని... వారి చిత్త శుద్ధిని తాము శంకించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే, డ్రగ్స్ కేసులో ఏ ఒక్కర్నీ వదలొద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... మాట మీద నిలబడతారో? లేదో? అనే విషయాన్ని వేచి చూడాలని చెప్పారు. గ్యాంగ్ స్టర్ నయీం మీద వేసిన సిట్ ఏమయిందని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారం సామాన్యమైన అంశం కాదని... దాన్ని తీవ్రవాదంతో సమానంగా చూడాలని అన్నారు.

డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరుగుతున్న తీరు అనుమానాలకు తావిస్తోందని పొంగులేటి చెప్పారు. గోవా నుంచి డ్రగ్స్ వస్తున్నట్టు తెలిసినా... గోవాకు సిట్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. డ్రగ్స్ లో ప్రమేయం ఉన్న బడా నిర్మాతలు, వారి పిల్లల పేర్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పెద్ద మనుషుల్ని తప్పిస్తే భ్రష్టుపట్టి పోతారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కొందరు పెద్దల ప్రమేయం ఉందనే విషయంపై తమ వద్ద కూడా సమాచారం ఉందని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఓ సినిమా షూటింగ్ లా డ్రగ్స్ విచారణ సాగుతోందని పొంగులేటి విమర్శించారు. దర్యాప్తు చేస్తున్న అధికారులపై ఎవరి ఒత్తిడి ఉంది? ఆ అదృశ్య హస్తాలు ఏమిటనే విషయం తెలియాల్సి ఉందని అన్నారు. విచారణ అధికారులకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో, వారికి సెక్యూరిటీ కల్పించాలని కోరారు. డ్రగ్స్ వ్యవహారంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటలకే పబ్ లు మూసేయాలని సూచించారు. సీసీ కెమెరాలు పబ్ లలో ఎందుకు లేవని ప్రశ్నించారు. 

More Telugu News