: ఇంగ్లీష్ వచ్చు కదా అని ఏది పడితే అది ట్వీట్ చేస్తావా?.. రామ్ గోపాల్ వర్మపై నిప్పులు చెరిగిన శివాజీరాజా

డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులను విచారిస్తున్న ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ కూడా మీడియా ముందుకు వచ్చి వర్మ వ్యాఖ్యలను ఖండించారు. తమకు సినీ పరిశ్రమపై ఎలాంటి కోపం లేదని, డ్రగ్స్ భూతం అంతం చూడటమే తమ లక్ష్యమని, తమ విచారణపై ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్ చేయవద్దని ఆయన కోరారు.

ఈ నేపథ్యంలో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ వర్మపై నిప్పులు చెరిగాడు. ప్రస్తుత పరిస్థితి చాలా సెన్సిటివ్ గా ఉందని... ఇలాంటి సందర్భంలో సిట్ విచారణపై వర్మ ఇలాంటి కామెంట్లు చేయడం సరైంది కాదని అన్నాడు. ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నారని... ఈయన మాత్రం ఇప్పుడే నిద్ర లేచి, ఇంగ్లీషు వచ్చు కదా అని, ఓ స్క్రిప్టు పడేస్తే ఎలా అని ప్రశ్నించారు. వర్మ వ్యవహారం ఇబ్బందులను తీసుకొచ్చేలా ఉందని... ఆయన మంచి సినిమాలు తీసి పేరు తెచ్చుకోవాలని, ఇలాంటి మాటలతో పాప్యులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయరాదని సూచించారు.

పోలీసు అధికారులకు తెలియంది ఏమీ ఉండదని, ఇలాంటి సమయంలో వర్మ ఈ కామెంట్లు చేయడం, సమస్యలను కొనితెచ్చుకోవడమే అవుతుందని శివాజీ రాజా అన్నాడు. సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నాలు చేయరాదని తెలిపాడు. ఎవరెవర్ని ఎంతెంత సేపు విచారిస్తే మనకెందుకని... వారి పని వారు చేస్తారని... మన డైరెక్షన్ లో వారు చేయి పెడితే మనం ఒప్పుకుంటామా? అని ప్రశ్నించాడు. ఎవరి పని వారు చేసుకోవాలని అన్నాడు. వర్మ చేసిన ట్వీట్ కు అర్థం ఉందని తాను భావించడం లేదని చెప్పాడు. రామ్ గోపాల్ వర్మకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదని అన్నాడు. ఈయన చేసిన వ్యాఖ్యలకు పోలీస్ డిపార్ట్ మెంట్ కు తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పాడు.

వర్మ గొప్ప డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని... కానీ, ఇలాంటి విషయాల్లో చేయి పెట్టడం ఏంటని శివాజీరాజా ప్రశ్నించాడు. పోలీసులను ప్రశ్నించేందుకు వర్మ ఎవరని అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదని చెప్పాడు. ఇంగ్లీషు వచ్చు కదా అని ఎదవ ట్వీట్లు పెట్టడం చాలా తప్పని అన్నాడు. మా అసోసియేషన్ కాని, అల్లు అరవింద్ లాంటి సినీ పెద్దలు కానీ ఎవరి పరిధిలో వారు పరిస్థితిపై స్పందిస్తున్నారని... ఇలాంటి సమయంలో వర్మ చేసింది తప్పేనని చెప్పాడు. 

More Telugu News