: వర్మ గారూ! మేము సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకోలేదు... చట్ట ప్రకారమే చేస్తున్నాం: ఎక్సైజ్ శాఖ

మాదకద్రవ్యాలు సమాజానికి ఎంత హాని చేస్తున్నాయో మీకు తెలియడం లేదని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ వివరాలు బయటకు తెలియకుండా, సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. కొంత మంది (రాంగోపాల్ వర్మ) చిన్న పిల్లలను కూడా 12 గంటల పాటు విచారిస్తారా? అని ప్రశ్నిస్తున్నారని, అయితే, శాస్త్రీయంగా తాము కేసును దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. పిల్లలు డ్రగ్స్ ను ఇతరులకు అలవాటు చేస్తారా? మజా పేరుతో స్నేహితులను ఉచ్చులోకి లాగుతారా? డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుందో పిల్లలకు తెలుస్తుందా? అంటూ నిలదీశారు.

ఎవరిని ఎలా విచారించాలో వారిని అలాగే విచారిస్తామని చంద్రవదన్ తెలిపారు. తామెవరికీ సర్టిఫికేట్లు మంజూరు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పని తాము చేస్తున్నామని, తమ పనితీరును ఎద్దేవా చేయడం సరైన విధానం కాదని సూచించారు. విచారణకు వచ్చిన వారందరూ సహకరిస్తున్నారని తెలిపారు. బాధితులు, నిందితులకు తమ విచారణ విధానం అర్థమవుతుందని చెప్పారు. సినీ పరిశ్రమను తాము లక్ష్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసును నీరుగార్చే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. సీఎం ఆదేశాలతో విచారణ ప్రారంభమైందని అన్నారు. చట్ట ప్రకారం తాము నడుచుకుంటున్నామని ఆయన తెలిపారు.

పిల్లలు డ్రగ్స్ కు బానిసలు కాకూడదనే ప్రభుత్వ ఆదేశాలతో తొలుత లోతుగా దర్యాప్తు ప్రారంభించామని, ఆ తరువాత సాఫ్ట్ వేర్ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ఇలా కొనసాగుతూ చిట్టచివరన సినీ పరిశ్రమ వద్దకు వచ్చామని ఆయన తెలిపారు. అంతే తప్ప, సెన్సేషన్ కోసం సినీ పరిశ్రమను తాము లక్ష్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, సిట్ పై పలు ఆరోపణలు చేస్తూ రాంగోపాల్ వర్మ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. భారత్ లో ఎక్సైజ్ శాఖ ఉందని తనకు ఇప్పుడే తెలిసిందని, అసలు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందని ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. 

More Telugu News