: ఆ ఎయిర్ హోస్టెస్ నూతన రాష్ట్రపతి కుమార్తె అని తెలిసి ఆశ్చర్యానికి గురైన ఎయిరిండియా ఉద్యోగినులు.... నిరాడంబరతకు నిదర్శనం!

సమాజంలో తల్లిదండ్రులే కాదు, కనీసం బంధువులు ఉన్నత స్థాయిలో ఉన్నా, వారి పేరు చెప్పుకుని ఎదిగేందుకు ప్రయత్నించే ప్రస్తుత తరుణంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి వ్యవహారశైలి అందర్నీ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. స్వాతి ఎయిరిండియాలో ఎయిర్‌ హోస్టెస్‌ గా పని చేస్తున్నారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నికయ్యేంత వరకు ఆయన పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. బీహార్ గవర్నర్ కావడంతో అక్కడితో పటు ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో ఆయన ఎవరో తెలుసు. మరికొన్ని ప్రాంతాల్లో ఆయన ఎవరో తెలియదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, యూరప్‌, అమెరికా వంటి దేశాలకు వెళ్లే ఎయిరిండియా బోయింగ్‌ 777, 787 విమానాల్లో స్వాతి ఎయిర్‌ హెస్టెస్‌ గా వ్యవహరించేవారు. ఆమె ఏనాడూ ఆయన తన తండ్రి అని చెప్పుకోలేదు. సాధారణ ఉద్యోగిగానే వ్యవహరించారు. గొప్పలు చెప్పుకోలేదు.

కార్యాలయంలోని అధికారిక పత్రాల్లో కూడా ఆమె తన ఇంటి పేరు చేర్చలేదు. తన తండ్రి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న సమయంలో ఆమె ప్రత్యేక సెలవుపై వెళ్లారు. సెలవుకు గల కారణాన్ని ఆమె వివరించలేదు. గురువారం వరకు ఆమె నూతన రాష్ట్రపతి రామ్ నాథ్ కుమార్తె అన్న సంగతి ఎయిర్ ఇండియాకు తెలియకపోవడం విశేషం. ప్రత్యేక సెలవుకు గల కారణాన్ని వివరించే క్రమంలో ఆమె నూతన రాష్ట్రపతి కుమార్తె అన్న విషయం ఎయిరిండియాకు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. ఇన్నేళ్ల కాలంలో ఏ రోజూ వారి అమ్మాయిని అని ఆమె ఎవరితోనూ చెప్పకపోవడం గమనార్హం. ఆమెప్పుడూ సాధారణ ఉద్యోగిలానే వ్యవహరించారే తప్ప ఏ రోజూ గొప్పలకు పోలేదని ఆమె సహోద్యోగిని తెలిపారు. తల్లి పేరును సవిత అని, తండ్రి పేరును ఆర్‌ఎన్‌ కోవింద్‌ అని పేర్కొన్న ఆమెను తమ సహోద్యోగి అని చెప్పుకోవడానికి గర్విస్తున్నామని ఎయిరిండియా సిబ్బంది తెలిపారు.

More Telugu News