: ఈ సినిమాను టైటిల్స్ నుంచి శుభం కార్డు వరకు చూడాలంటే 30 రోజులు పడుతుంది!

సాధారణంగా సినిమా నిడివి గంటన్నర నుంచి మూడు గంటల మధ్యలో ఉంటుంది. అయితే అందరికీ భిన్నంగా సుమారు 30 రోజుల నిడివి అంటే 720 గంటల నిడివి గల సినిమాను స్వీడన్‌ కు చెందిన ప్రముఖ దర్శకుడు ఆండర్స్‌ వెబెర్గ్‌ రూపొందిస్తున్నారు. 2020 నాటికి సినిమా ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్న ఆయన, తనకు బాగా పరిచయమున్న విజువల్‌ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర సినీ విభాగాల్లో ఏదైనా సరికొత్త ప్రయోగం చేయాలని భావించాడు. దీంతో ప్రపంచంలో అత్యంత ఎక్కువ నిడివిగల సినిమాను రూపొందించాలని నిర్ణయించాడు. దీంతో 30 రోజుల సుదీర్ఘ సినిమాకు శ్రీకారం చుట్టాడు. 30 రోజుల నిడివితో రూపొందుతున్న ఈ సినిమా పేరు "యాంబియెన్స్‌"గా నామకరణం చేశాడు.

ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తైంది. నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ ఆరంభించాడు. ఇందులో వంద మంది నటించారు. ఈ సినిమాకు కథ, సంభాషణలు ఉండవు.. కేవలం నటీనటులతో పాటు దృశ్యాల్ని మాత్రమే చిత్రీకరించి, వాటికి ఎక్కువగా విజువల్‌ ఎఫెక్ట్స్ జోడించి రూపొందించడమే ఈ సినిమా ప్రత్యేకత. దీనికి సంబంధించిన పనిలో ఆయన తలమునకలై ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్స్ ను కూడా విడుదల చేశాడు.  2014లో విడుదల చేసిన తొలి ట్రైలర్ నిడివి ఏడు నిమిషాలు కాగా, గతేడాది విడుదల చేసిన రెండో ట్రైలర్ నిడివి ఏడు గంటలు... కేవలం ట్రైలరే రెండు పెద్ద సినిమాలంత నిడివి ఉండడంతో దీనిని కేవలం 41,334 మంది మాత్రమే వీక్షించారు.

వచ్చే ఏడాది చివర్లో మూడో ట్రైలర్ విడుదల కానుండగా, దీని నిడివి రికార్డు స్థాయిలో సుమారు 72 గంటలు ఉండనుంది. అంటే మూడు రోజులంత నిడివి అన్నమాట. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు విడుదల చేసి, ఒకేసారి ప్రదర్శించనున్నాడు. 30 రోజుల ప్రదర్శన పూర్తయిన అనంతరం ఈ సినిమా కాపీని కాల్చేయనున్నారు. తద్వారా చరిత్రలో ఈ సినిమాను రూపొందించి, దాని ప్రతులు దొరక్కుండా చేయగల ఏకైన వ్యక్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు. ఈ సినిమా 2020లో విడుదల కానుంది.

More Telugu News