: ఓటమిలోనూ 50 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన మీరా కుమార్

గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా తాను సైద్ధాంతికంగా పోరాడుతున్నానని స్పష్టం చేసిన యూపీఏ తరఫు రాష్ట్రపతి అభ్యర్థిని మీరా కుమార్, ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, 50 ఏళ్ల నాటి ఓ రికార్డును తిరగరాశారు. మొత్తం 10.69 లక్షల విలువైన ఓట్లు పోల్ కాగా, మీరాకు 3.67 లక్షల ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. గడచిన 50 ఏళ్ల భారతావని చరిత్రలో విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడి ఇంత అధిక స్థాయిలో ఓట్లను తెచ్చుకున్నది మీరా కుమారే.

1967లో అప్పటి రాష్ట్రపతి అభ్యర్థి జాకిర్ హుస్సేన్ పై పోటీ పడ్డ యునైటెడ్ అపోజిషన్ పార్టీస్ అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు, నాటి ఎన్నికల్లో 3.63 లక్షల ఓట్లను సాధించారు. ఆపై ఆ స్థాయిని దాటి ప్రజా ప్రతినిధుల ఓట్లను పొందిన వారెవరూ లేకపోవడం గమనార్హం. అప్పట్లో జాకిర్, సుబ్బారావుల మధ్య చాలా గట్టి పోటీ నడిచింది. సుబ్బారావుకు 43 శాతం ఓట్ షేర్ దక్కగా, జాకిర్ 57 శాతం ఓట్లు సాధించి విజయం సాధించారు. సుబ్బారావుకు వచ్చిన ఓట్ల విలువనైతే మీరా కుమార్ దాటారు గానీ, ఓట్ల శాతం విషయంలో మాత్రం ఆయన రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. ఈ ఎన్నికల్లో మీరాకు 34 శాతం ఓట్లు లభించాయన్న సంగతి తెలిసిందే.

More Telugu News