: ప్రశంసల జడివానలో తడిసిముద్దవుతున్న హర్మన్‌ప్రీత్‌.. కపిల్ నుంచి నూతన రాష్ట్రపతి వరకు ట్వీట్లే.. ట్వీట్లు!

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి ఆడి ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చిన టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ విమెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌పై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. తన ఆటతీరుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను తలపించిందని చెబుతున్నారు. 1983లో జరిగిన ప్రూడెన్షిల్ వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో కపిల్ వీర విహారం చేశాడు. 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఉన్న దశలో బరిలోకి దిగిన హర్యానా హరికేన్ 138 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు.  

కాగా, గురువారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ దశలో 101 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు జట్టు బాధ్యతను తనపై వేసుకున్న హర్మన్ 115 బంతుల్లో 171 పరుగులు చేసింది. ఇందులో 20 ఫోర్లు, ఏడు సిక్స్‌లు ఉన్నాయి. కాగా, హర్మన్ ఆటతీరుకు, పోరాట పటిమకు తాజా, మాజీ క్రికెటర్లు సహా క్రికెట్ ప్రేమికులందరూ ముగ్ధులయ్యారు. ట్విట్టర్ వేదికగా హర్మన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, చటేశ్వర్ పుజారా, నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్, మోహన్ దాస్ మీనన్ తదితరులు ప్రశంసలు కురిపించారు. ఆమె ఆటతీరు ‘మైండ్ బ్లోయింగ్’ అని కొనియాడారు.

More Telugu News