: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ఇండిగో ఎయిర్ లైన్స్ వివాదం ఇలా ముగిసింది!

విశాఖప‌ట్నం విమానాశ్రయంలోని తమ సిబ్బందితో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఇండిగో ఎయిర్ లైన్స్ విధించిన నిషేధాన్ని సదరు సంస్థ నిన్న ఎత్తివేసిన విషయం తెలిసిందే. సోమ‌వారం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌రిగిన నేప‌థ్యంలో ఓటు వేయ‌డానికి జేసీ దివాక‌ర్ రెడ్డి రూ.6 లక్షలు ఖర్చుపెట్టి ప్రత్యేక విమానంలో అక్క‌డ‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా జేసీ దివాకర్ రెడ్డి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. తనపై విమానయాన నిషేధాన్ని ఎత్తివేసేలా చేయాలని జైట్లీని ఆయ‌న‌ కోరారు. జైట్లీ.. విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత అశోక్ గ‌జ‌ప‌తి రాజుతో ఈ అంశంపై చ‌ర్చించాల‌ని సూచించారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని అక్క‌డే ఉన్న కేంద్ర మంత్రి సుజనాచౌదరికి కూడా జైట్లీ చెప్పారు.

దీంతో జేసీ, సుజ‌నా చౌద‌రి ఇద్దరూ అశోక్‌గజపతిరాజు కార్యాలయానికి వెళ్లారు. అయితే, జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ లేఖ ఇవ్వడానికి దివాకర్‌రెడ్డి ఒప్పుకోలేదు. త‌న తప్పు అంత‌గా లేద‌ని, ఇండిగో ఉద్యోగి ప్రవర్తించిన తీరు బాగోలేద‌ని ఆయన వాదించారు. దీంతో ఇండిగో ఎయిర్‌పోర్ట్స్‌ ఆపరేషన్స్‌ ప్రతినిధి రామ్‌దాస్‌, జేసీల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. అంతేగాక‌, జేసీ ఆరోప‌ణ‌లు చేస్తోన్న ఇండిగో సిబ్బందిని ఢిల్లీకి పిలిపించి సుజనాచౌదరి నివాసంలో చ‌ర్చ‌లు జ‌రిపారు. సుజనాచౌదరి వారిద్ద‌రితో కరచాలనం చేయించి, వివాదానికి తెరదించారు. అనంత‌రం ఇండిగో, ఎయిర్‌ ఇండియాల నుంచి జేసీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. త‌న‌పై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ జేసీ దివాక‌ర్ రెడ్డి హైకోర్టులో వేసిన కేసును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిసింది.  

More Telugu News