: జ‌హీర్ క‌న్నా భ‌ర‌త్ ఎలా గొప్ప?.... కొత్త బౌలింగ్ కోచ్ పూర్తి వివ‌రాలు!

జ‌హీర్ ఖాన్‌ను కాద‌ని ఏడాది కాలం పాటు కూడా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొన‌సాగ‌ని భ‌ర‌త్ అరుణ్‌ను భార‌త జ‌ట్టు బౌలింగ్ కోచ్‌గా తీసుకోవ‌డానికి బీసీసీఐ ఏయే అంశాలు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని ఉంటుందో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు. అలాగ‌ని భ‌ర‌త్ అరుణ్ అయోగ్యుడేం కాదు. భార‌త జ‌ట్టు విజ‌యాల్లో ప్ర‌త్య‌క్షంగా అత‌ని ప్రాబ‌ల్యం లేక‌పోయినా ప‌రోక్షంగా భ‌ర‌త్ ఎంతో కృషి చేశారు. క్రికెట‌ర్‌గా ఎక్కువ‌కాలం కొన‌సాగ‌క‌పోయినా కోచ్‌గా అత‌నికి 15 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆ అనుభవ‌మే భార‌త జ‌ట్టు బౌలింగ్ కోచ్ ఎంపిక‌య్యే అవ‌కాశాన్ని క‌ల్పించింది.

నాలుగు వ‌న్డేలు, రెండు టెస్టులు క‌లిపి భ‌ర‌త్ తీసిన వికెట్లు ఐదే అయ్యుండొచ్చు కానీ బౌలింగ్ కోచ్‌గా అత‌ని ఖాతాలో విజ‌యాలు మాత్రం చాలానే ఉన్నాయి. 2002లో త‌మిళ‌నాడులో తొలిసారి కోచ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన భ‌ర‌త్ వ‌ల్ల 2003, 2004ల్లో తమిళ‌నాడు జ‌ట్టు రంజీట్రోఫీ సాధించింది. 2008లో జాతీయ క్రికెట్ అకాడ‌మీ చీఫ్ కోచ్‌గా ఎంపికైన భ‌ర‌త్, ఆస్ట్రేలియాలో భార‌త్‌-ఎ జ‌ట్టు మూడు సిరీస్‌ల్లో విజయం సాధించేలా చేశాడు. ఇక అండ‌ర్ 19 జ‌ట్టుకి కోచ్‌గా చేరిన త‌ర్వాత ఆ జ‌ట్టు సాధించిన 8 విజ‌యాల‌కు, 2012 ప్ర‌పంచ‌క‌ప్ గెల్చుకోవ‌డానికి భ‌ర‌త్ కార‌ణ‌మ‌య్యాడు. ఇంకా ఇలాంటి విజ‌యాలు భ‌ర‌త్ ఖాతాలో చాలానే ఉన్నాయి.

1962లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో జ‌న్మించిన భ‌ర‌త్, ప్ర‌స్తుత కోచ్ ర‌విశాస్త్రికి స‌న్నిహితుడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టుకు భ‌ర‌త్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. త‌ర్వాత రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకి స‌హాయ కోచ్‌గా కూడా పనిచేశాడు. అంతేకాకుండా వ్య‌క్తిత్వం విష‌యంలో భ‌ర‌త్ మంచి మార్కులే కొట్టేశాడు. ప్ర‌స్తుత యువఆట‌గాళ్లంద‌రితోనూ భ‌ర‌త్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆట‌గాళ్ల‌లో స్ఫూర్తి నింప‌డానికి వారితో అత‌నికున్న సంబంధాలే ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే బీసీసీఐ భ‌ర‌త్‌ను ఎంచుకున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News