: పూరీకి 'సినిమా' చూపించిన అధికారులు.. ఆ 11 గంటలు లోపలేం జరిగిందంటే...!

పూరీ జగన్నాథ్.. ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ఏ ఇద్దరిని చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో బుధవారం సిట్ ఎదుట హాజరైన ఈ టాలీవుడ్ దర్శకుడిని అధికారులు ఏకంగా 11 గంటలపాటు విచారించడం సంచలనంగా మారింది. ఉదయం 10:30 గంటలకు మొదలైన విచారణ ఏకంగా రాత్రి 9:30 వరకు కొనసాగింది. ఏకంగా 500 వరకు ప్రశ్నలు సంధించిన అధికారులు పూరీని ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది. అయితే మూసిన తలుపులు వెనక ఏం జరిగిందన్న ఉత్కంఠ ఇప్పుడు చిత్రసీమను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.  

బుధవారం ఉదయం విచారణ కోసం పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్‌కు చేరుకున్నారు. సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఎలా సమాధానాలు చెప్పాలి? అనే విషయంలో ముందుగానే న్యాయనిపుణులతో చర్చించి పూర్తిగా సన్నద్ధమై వచ్చారు. అయితే అధికారులు అతడిని రొటీన్‌కు భిన్నంగా విచారించినట్టు తెలుస్తోంది. సినిమాలు, కేసు విషయాలతో సంబంధంలేని ప్రశ్నలతో విచారణ మొదలుపెట్టారు. చేయబోయే సినిమాల గురించి, ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాలు, హీరో, హీరోయిన్లు ఎవరు? షూటింగ్స్‌కు అనుకూలమైన ప్రదేశం.. ఇలా, చిన్నగా చర్చ ప్రారంభించారు. టీ బ్రేక్ వరకు ఇదే కొనసాగింది. ఆ తర్వాత ఆయన దినచర్య, ఇతర అంశాల గురించి ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. మధ్యాహ్నం భోజనం తర్వాత పూరీకి తెలియకుండానే నెమ్మదిగా అధికారులు రంగంలోకి దిగి కావాల్సిన సమాచారాన్ని రాబట్టారు. పూరీతోపాటు కార్యాలయానికి వచ్చిన ఆయన కుమారుడు ఆకాశ్, సోదరుడు సాయిరాం శంకర్‌కు కూడా అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు.

లంచ్ తర్వాత పూరీకి సంధిస్తున్న ప్రశ్నలు ఒక్కసారిగా మారిపోవడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాగుడు అలవాటుందా? అంటూ మొదలుపెట్టిన అధికారులు డ్రగ్స్ అలవాటు గురించి ప్రశ్నించారు. కెల్విన్ ఎవరు? డ్రగ్స్ ఎప్పటి నుంచి అతడి వద్ద కొనుగోలు చేస్తున్నారు? డ్రగ్స్ తీసుకునే సమయంలో మీతో ఉండేది ఎవరు? టాలీవుడ్‌లో ఇంకా ఎంతమందికి ఇటువంటి అలవాటు ఉంది.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో పూరీలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. అన్నింటికీ అవును, కాదు.. అంటూ పొడిపొడి సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది.

విచారణ సాయంత్రం ఐదు గంటల వరకేనని అధికారులు తొలుత ప్రకటించారు. అయితే ఐదు దాటినా కొనసాగుతుండడంతో పూరీ అరెస్ట్ తథ్యమని భావించారు. దీనికితోడు ఉస్మానియా వైద్యులు, నార్కోటిక్స్ బృందం కార్యాలయానికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆరోగ్య పరీక్షల అనంతరం అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయనను విడిచిపెట్టడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక పూరీని విచారిస్తున్నప్పుడు లోపల గదిలో ఓ డాక్టర్, వీడియో గ్రాఫర్‌తోపాటు సూర్యాపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ శీలం శ్రీనివాసరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News