: శశికళను ఇతర ఖైదీల మాదిరే పరిగణించండి: కర్ణాటక జైళ్ల ఏడీజీపీ

పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే చీఫ్ శశికళను, ఇతర ఖైదీల మాదిరే పరిగణించాలని, ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించవద్దని కర్ణాటక జైళ్ల విభాగం ఏడీజీపీ ఎన్ఎస్ మేఘరిక్ హెచ్చరించారు. జైళ్ల విభాగం బాధ్యతలు స్వీకరించిన అనంతరం, తొలిసారిగా ఈ రోజు పరప్పణ అగ్రహార జైలును ఆయన సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించిన అనంతరం, అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మేఘరిక్ మాట్లాడుతూ, ఖైదీలకు జైలు నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించాలని, నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఖైదీకి వసతులు కల్పించవద్దని హెచ్చరించారు. జైలు లోపలి దృశ్యాలను చిత్రీకరించి వాటిని మీడియాకు లీక్ చేయవద్దని, ఆ విధంగా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖైదీల సమస్యలపై ఏ సమయంలోనైనా అధికారులు తనను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా, ఖైదీలతో కూడా మేఘరిక్ మాట్లాడారు.

More Telugu News