: ఆనాడు ఎన్టీఆర్ చాచిపెట్టి కొట్టి వుంటే, ఇక నా అకౌంట్ క్లోజ్ అయ్యుండేది!: కోట శ్రీనివాసరావు

తాను ఎన్టీ రామారావును అనుకరిస్తూ, 'మండలాధీశుడు'లో నటించిన వేళ, తనను విజయవాడ రైల్వే స్టేషన్ లో ఫ్యాన్స్ కొట్టిన అంశాలను, ఆపై తాను ఎన్టీఆర్ ను కలిసిన విషయాన్ని కోట శ్రీనివాసరావు ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చిత్రం తీశారని తెలిస్తే ఆయన అభిమానులు తట్టుకోవడం కష్టమని తనకు తెలుసునని, అయితే, ఆ వ్యతిరేకత ఇంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ఊహించలేదని అన్నారు. తాను ఆ చిత్రంలో రామారావును అనుకరించానే తప్ప, కించపరచలేదని అన్నారు. ఆ సినిమా విడుదలైన తరువాత, హైదరాబాద్ వెళ్లే నిమిత్తం విజయవాడ రైల్వే స్టేషన్ కు వచ్చానని చెప్పారు. అక్కడ తెలుగుదేశం పార్టీ వారు జెండాలతో చాలా మంది కనిపించారని, ఏదో ప్రమాదాన్ని ఊహిస్తుంటేనే, 'కోటా గాడు వచ్చాడురా' అంటూనే దాడి చేసి కొట్టారని అన్నారు.

ఇక ఆ మహానటుడితో నటించే అవకాశం తన జీవితంలో రాలేదని, మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాల్సి వున్నా, తేదీలు ఖరారయ్యాక తప్పిపోయిందని గుర్తు చేసుకున్నారు. అంతకు ముందే 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' డబ్బింగ్ చెప్పి వస్తున్న ఎన్టీఆర్ ను మద్రాసు విమానాశ్రయంలో కలిశానని, ఆయనకు నమస్కారం పెడితే, భుజం తట్టి అభినందించారని, ఆశీర్వదించారని అన్నారు. ఇక అక్కడే ఉన్న తన మిత్రులంతా, 'అంత ధైర్యంగా ఆయన ముందుకు వెళ్లావు. లాగి ఒకటి పీకుంటే ఏమయ్యేది?' అని అడిగితే, దిక్కుమాలిన వాళ్లందరి దగ్గరా రోజూ తిట్లు తినేందుకు బదులుగా ఆయన్ను పలకరించి, ఓ దెబ్బ తినుంటే అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉండేది కదా? అని చెప్పానని కోట నవ్వుతూ అన్నారు.

More Telugu News