: రాజభోగాలకు చెక్.. ఖైదీ దుస్తులతో సాధారణ ఖైదీల్లా శశి, ఇళవరసి!

అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళ సోమవారం ఒక్కసారిగా సాధారణ ఖైదీలా మారిపోయారు. శశికళ, ఆమె వదిన ఇళవరసి ఇద్దరూ ఖైదీలు ధరించిన దుస్తులు ధరించి మామూలు గదిలోనే ఉండిపోయారు. మొన్నటి వరకు అనుభవించిన రాజభోగాలను, మృష్టాన్న భోజనానికి బదులు పులిహోర, పెరుగన్నం, సాంబారు, రాగి సంకటితో సరిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. శనివారం వరకు శశికళ జైలులోని ఓ అంతస్తులోని ఐదు గదుల్లో గడిపారు. సొంత ఇంట్లో ఉన్నట్టుగానే హల్‌చల్ చేశారు.  

జైలులో ఆమె పొందుతున్న సౌకర్యాల గురించి డీఐజీ రూప మౌద్గిల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు. సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలను జైలు సిబ్బందికి ముట్టజెప్పినట్టు ఆరోపించారు. ఆమె ఆరోపణలు చేసిన మరునాడే అధికారులు రూపపై బదిలీ వేటు వేశారు.  మంగళవారం ఆమె నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రూప మాట్లాడుతూ జైలులోని అక్రమాలను బయటపెట్టినందుకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ తనను అభినందించినట్టు తెలిపారు. డీఐజీ రూప బదిలీపై పోలీస్ డైరెక్టర్ జనరల్ రూప్ కుమార్ మాట్లాడుతూ రూపది బదిలీయే తప్ప శిక్ష కాదని పేర్కొన్నారు.

More Telugu News