: యాకూబ్‌ మెమన్‌కు మద్దతుపై సమర్థించుకున్న గోపాల్‌కృష్ణ గాంధీ.. మరణశిక్షలు మధ్యయుగం నాటివన్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి!

ముంబై పేలుళ్ల కేసులో మరణశిక్షకు గురైన యాకూబ్ మెమన్‌ కు అప్పట్లో క్షమాభిక్ష పెట్టాలంటూ వచ్చిన అభ్యర్థనకు తాను మద్దతు ప్రకటించడంపై నలువైపులా నుంచీ వస్తున్న విమర్శలపై యూపీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి గోపాల్‌కృష్ణ గాంధీ స్పందించారు. మరణశిక్ష మధ్యయుగం నాటిదని ఆయన పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్‌లు కూడా మరణశిక్షణను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంగళవారం గోపాల్‌కృష్ణ గాంధీ ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత దేశ రాజకీయాలపై ప్రజలకు విశ్వసనీయత పోయిందన్నారు. దానిని తిరిగి పునరుద్ధరించేందుకు తాను వారధిలా పనిచేస్తానన్నారు. తాను ఏ పార్టీ తరపునో ప్రాతినిధ్యం వహించడం లేదని, సాధారణ పౌరుడిగానే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వివరించారు. మరణశిక్ష తప్పు అనేదే తన సిద్ధాంతమని చెప్పారు.

శివసేన చేసిన విమర్శలపై స్పందిస్తూ ఆ పార్టీ చిత్తశుద్ధిగానే తన విధిని నిర్వహిస్తోందని, అయితే మరణ శిక్షకు మాత్రం తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్‌ జాదవ్‌పైనా తన అభిప్రాయం ఇదేనన్నారు. మరోవైపు బీజేపీ కూడా గోపాల్‌కృష్ణ గాంధీపై మండిపడింది. యాకూబ్ మెమన్‌ను మరణశిక్ష నుంచి కాపాడేందుకు ఆయన ప్రయత్నించారని మండిపడింది.

More Telugu News