: బాధగా ఉన్నా ఈ మాట చెబుతున్నా... బీజేపీ ఇక నా పార్టీ కాదు!: వెంకయ్యనాయుడు

ఎన్నో దశాబ్దాలుగా తల్లిగా భావిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ, ఇక తన పార్టీ కాదని చెప్పేందుకు బాధపడుతున్నానని ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్య, బీజేపీని వదిలినందుకు ఓ వైపు బాధపడుతూనే, భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతలను తలపైకి ఎత్తుకుంటున్నందుకు ఆనందంగానే ఉందని అన్నారు. ఇప్పుడు తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని, రాజకీయ పార్టీలకు అతీతంగా, తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ఉప రాష్ట్రపతి బాధ్యతలు ఎలాంటివో, వాటిని ఎలా నిర్వర్తించాలో, భారత సంప్రదాయాలను ఎలా కాపాడాలో తనకు తెలుసునని, తాను ఈ పదవికి ఎంపికైతే, పక్షపాతాలు చూపించకుండా వ్యవహరిస్తానని, పదవికే వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. గతంలో ఉప రాష్ట్రపతులుగా పనిచేసిన వారి అడుగు జాడల్లో నడుస్తానని వెంకయ్యనాయుడు వెల్లడించారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు.

More Telugu News