: సినిమా పిచ్చితోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన నిజాంపేట బాలిక పూర్ణిమ సాయి!

నలభై రోజుల క్రితం హైదరాబాద్ శివారు నిజాంపేట సమీపంలోని భాష్యం స్కూలుకు వెళ్లి అదృశ్యమైన పదో తరగతి బాలిక పూర్ణిమ సాయి ఆచూకీ నిన్న లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. ఓ టీవీ చానల్ లో ప్రసారమయ్యే సీరియల్ కు చెందిన వారితో ఇన్ స్టాగ్రామ్ ద్వారా రాత్రిపూట సంభాషిస్తుండే పూర్ణిమకు సినిమా రంగంలో రాణించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో గత నెల 7వ తేదీన, ఇంటి నుంచి రూ. 1000 తీసుకుని, సికింద్రాబాద్ స్టేషనుకు వెళ్లి, అక్కడి నుంచి ముంబై ఎక్స్ ప్రెస్ ఎక్కి దాదర్ రైల్వే స్టేషన్ లో దిగింది.

అయితే, ముంబై చేరిన ఆమెకు ఎక్కడకు వెళ్లాలో తెలియక, దాదర్ సమీపంలోని బోయివాడ పోలీసు స్టేషన్ కు వెళ్లి, తన పేరు అనికశ్రీ అని, అనాధనని, సికింద్రాబాద్ లోని సాయిశ్రీ ఆశ్రమం నుంచి వచ్చానని అబద్ధాలు చెప్పగా, వారు బాలసుధార్ గృహ్ కు తరలించారు. ఆపై విచారణలో భాగంగా హైదరాబాద్ పోలీసులు, దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లకూ పూర్ణిమ ఫోటోలు పంపగా, అనుమానం వచ్చిన బోయివాడ పోలీసులు, ఇక్కడికి సమాచారం ఇచ్చారు. వారు పంపిన ఫోటోలను పూర్ణిమ తల్లిదండ్రులు గుర్తించారు. కాగా, ఆదివారం నాడు పూర్ణిమ పుట్టిన రోజు కాగా, అదే రోజున ఆమె ఆచూకీ గురించి లభ్యం కావడం విశేషం. దీంతో ఆమె తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

More Telugu News