: జయ మృతిపై ఈపీఎస్‌ను ప్రశ్నించి సమాధానం రాబడితే రూ.10 వేలు ఇస్తా!: పన్నీర్ సెల్వం బంపరాఫర్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆదివారం బంపరాఫర్ ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై న్యాయ విచారణ జరిపిస్తారా? లేదా? అన్న విషయంపై ముఖ్యమంత్రి పళనిస్వామిని ప్రశ్నించి సమాధానం రాబట్టిన వారికి రూ.10వేలు  ఇస్తానని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న పన్నీర్ సెల్వం ఈ వ్యాఖ్యలు చేశారు. జయ మృతిపై నెలకొన్న అనుమానాలు నివృత్తి అయ్యే వరకు తమ ‘ధర్మయుద్ధం’ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే (అమ్మ) నేత వీకే శశికళ.. జయలలితో, ఆమె ప్రతినిధో కాబోదని తేల్చి చెప్పారు. ఎంజీ రామచంద్రన్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని ఈ సందర్భంగా ఓపీఎస్ గుర్తు చేశారు. కానీ, శశికళ మాత్రం తన కుటుంబ సభ్యులు 16 మందిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తద్వారా పార్టీపై పట్టుపెంచుకోవాలని చూస్తున్నారన్నారు. శశికళ సహా వారందరినీ జయలలిత ఎప్పుడో బహిష్కరించారని, అయితే క్షమాపణలు చెప్పి మళ్లీ జయ చెంతకు చేరారని విమర్శించారు.

More Telugu News