: నేటి సాయంత్రానికి ఎమ్మెల్యేలు అందరూ విజయవాడ చేరుకోవాలి: చంద్రబాబు ఆదేశం

రేపు రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, నేటి సాయంత్రానికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ విజయవాడ చేరుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అందరినీ ఒక రోజు ముందే విజయవాడకు చేరుకోవాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం 8 గంటలకు టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆపై రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చిస్తారని, ఆ తరువాత అమరావతి అసెంబ్లీలో ఏర్పాటు చేసే పోలింగ్ బూత్ లో వీరంతా తమ ఓట్లు వేయనున్నారని తెలుస్తోంది.

తొలి ఓటును చంద్రబాబునాయుడు వేయనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున రామ్ నాథ్ కోవింద్, యూపీఏ తరఫున మీరా కుమార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు రాజధాని ఢిల్లీలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు పోలింగ్ జరగనుండగా, ఆపై 20న ఓట్ల లెక్కింపు జరిపి, అదే రోజున ఫలితాన్ని వెల్లడిస్తారు. గెలుపొందిన అభ్యర్థి 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

More Telugu News