: ధోనిని వ‌దిలే ప్ర‌సక్తే లేదు: చెన్నై సూప‌ర్ కింగ్స్‌

ఏ మాత్రం అవ‌కాశ‌మున్నా త‌మ జ‌ట్టులోకి మ‌హేంద్ర‌సింగ్ ధోనీని తిరిగి తెచ్చుకుంటామ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్ర‌తినిధి జార్జ్ జాన్‌ చెప్పారు. అధికారికంగా త‌మ‌పై విధించిన నిషేధం తొల‌గిపోవడంతో 2015లో ఉన్న ఆట‌గాళ్ల‌ను, సిబ్బందిని వీలైనంత మేర‌కు తిరిగి నియ‌మించుకుంటామ‌ని ఆయ‌న‌ అన్నారు. `ఈ విష‌యం గురించి మేం ఇంకా ధోనీని సంప్ర‌దించ‌లేదు. ఈ ఏడాది చివ‌రిలోగా పూణె జ‌ట్టుతో ఆయ‌న ఒప్పందం ముగుస్తుంది. కాబ‌ట్టి బీసీసీఐ ఆదేశాల మేర‌కు ఏదైనా అవ‌కాశం ఉంటే ధోనీని తిరిగి జ‌ట్టులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తాం` అని జాన్ వివ‌రించారు.

2015లో నిషేధం విధించిన‌పుడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ జ‌ట్టు కోచ్‌గా ఉన్నారు. ఆయ‌న‌ను కూడా తిరిగి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని జాన్ తెలిపారు. ప్ర‌స్తుతం గ‌త ఐపీఎల్ సీజ‌న్ల‌లో సీఎస్‌కే జ‌ట్టు సాధించిన విజ‌యాల‌ను గుర్తు చేస్తూ సోష‌ల్ మీడియాలో ఇప్ప‌ట్నుంచే ప్ర‌చారం మొద‌లు పెడ‌తామ‌ని ఆయ‌న చెప్పారు. 2013 ఐపీఎల్‌లో బెట్టింగ్‌, స్పాట్ ఫిక్సింగ్ కేసుల్లో నేరం రుజువైన కార‌ణంగా 2015లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల‌పై బీసీసీఐ నిషేధం విధించింది.

More Telugu News