: రాష్ట్రపతి ఎన్నికల ఓటర్లలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారు 33 శాతం!

మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,852 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారు వినియోగించుకోబోయే మొత్తం ఓట్ల విలువ 10.9 లక్షలు. వీటిలో లక్ష ఓట్లు మాత్రమే మహిళలవి. అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్)లోని  ఎలక్టోరల్ కాలేజీ విశ్లేషకుల ప్రకారం.. మొత్తం 4,852 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో మహిళలు కేవలం 451 మందే. వీరిలో లోక్‌సభ ఎంపీలు 65 మంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. నాగాలాండ్ నుంచి ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం లేదు. ఆ రాష్ట్రంలోని ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఒక్క మహిళ కూడా లేదు.

ఇక మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 34 శాతం మంది లోక్‌సభ సభ్యులు, 19 శాతం మంది రాజ్యసభ సభ్యులు, 33 శాతం మంది అన్ని రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యులు ఉన్నారు. వీరిలో 20 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అటువంటి వారిలో ఆర్జేడీకి చెందిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, ఏఐటీసీకి చెందిన బేచారామ్ మన్న, ఆర్జేడీకి చెందిన మొహమ్మద్ ఇలియాస్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 71 శాతం మంది కోటీశ్వరులు.

More Telugu News