: ఎన్ని ప్రత్యేకతలో... ఇండియాలో తొలి 'వీవీఐపీ చెట్టు', ఏటా రూ. 12 లక్షల ఖర్చుతో కాపాడుతున్న మధ్యప్రదేశ్!

అదో రావి చెట్టు. ఇండియాలో తొలి వీవీఐపీ వృక్షరాజం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ప్రాంతమైన మధ్యప్రదేశ్ లోని సాంచీ బుద్ధిస్ట్ కాంప్లెక్స్ కు 5 కిలోమీటర్ల దూరంలో పెరుగుతోంది. భోపాల్, విదిష నగరాల మధ్య రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఈ చెట్టు సంరక్షణకు ప్రభుత్వం వెచ్చిస్తున్నది ఎంతో తెలుసా? సంవత్సరానికి రూ. 12 లక్షలు! ఈ చెట్టుకు కాపలాగా పోలీసులు, ఆలనా పాలనా చూసుకునేందుకు ప్రత్యేక సిబ్బందీ ఉన్నారు. పశువులు జొరబడకుండా చుట్టూ బలమైన ఫెన్సింగ్ కూడా ఉంది. ఇంతకీ ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటారా? చాలానే వుంది.

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగించిన రావి చెట్టు కొమ్మల నుంచి దీని మొక్కను సృష్టించారు. అప్పట్లో లంక బౌద్ధులు, చెట్టు శాఖలు తీసుకు వెళ్లి తమ దేశంలోని అనురాధపుర ప్రాంతంలో నాటగా, అది శాఖోప శాఖలుగా విస్తరించింది. ఐదేళ్ల క్రితం దాని అంటును తీసుకుని భారత్ కు వచ్చిన అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స, స్వయంగా తన చేతులతో దీన్ని నాటారు. అప్పటి నుంచి దీని సంరక్షణ భారాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా చూసుకుంటోంది.

2012లో చిన్న మొక్కగా ఉన్న ఇది, ఇప్పుడు ఓ మోస్తరుగా పెరిగింది. నలుగురు హోంగార్డులతో కాపలా, దీనికి నీరందించేందుకు ఓ ట్యాంకు, ప్రతి వారం వచ్చి, దాని ఆరోగ్యాన్ని, ఎదుగుదలను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యవసాయ విభాగం నుంచి బొటానిస్టు తదితర సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. ఇక ఈ ప్రాంతంలోని సాంచీకి వచ్చే బౌద్ధులంతా, ఈ మహాబోధి అంశను చూసుకుని భక్తితో ప్రణమిల్లి వెళుతుంటారు. అందుకే ఇది ఇండియాలో తొలి వీవీఐపీ చెట్టుగా ఎదిగింది.

More Telugu News