: నిజమైన అద్భుతం... 80 మంది చేయి చేయి కలిపి.. సముద్రంలో మునిగిపోతున్న కుటుంబాన్ని ఒడ్డుకే తెచ్చారు!

అమెరికాలోని ఫ్లోరిడా బీచ్ లో అద్భుతం చోటుచేసుకుంది. చేయిచేయి కలిపి సాగితే ఎటువంటి ఉపద్రవాన్నయినా దాటేయొచ్చని నిరూపితమైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.... ఫ్లోరిడాలోని పనామా సిటీ బీచ్‌ కు రాబెర్టా ఉర్స్‌ రే అనే మహిళ తన 9 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేందుకు వచ్చింది. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా రైడ్‌ చేస్తుండగా ఊహించని విధంగా వారు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోసాగింది. దీంతో ప్రాణాలపై ఆశలు వదిలేసిన కుటుంబ సభ్యులు, తమను రక్షించాలంటూ చేతులు పైకెత్తి ఆర్తనాదాలు చేశారు. దీనిని బీచ్ ఒడ్డున ఉన్న కొంత మంది చూశారు. వేగంగా స్పందించారు. ఒకరి చేయి ఒకరు పట్టుకుంటూ సుమారు 80 మంది ఫ్లోరిడా వాసులు మానవహారంగా ఏర్పడ్డారు.

ఈత తెలిసిన వారు ముందుగా వెళ్తూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని నిలబడి, ఆ కుటుంబంలోని అందర్నీ రక్షించారు. 9 మందిని రక్షించడంలో తాము కూడా ఒక భాగమైనందుకు ఆ 80 మంది సంతోషం వ్యక్తం చేయగా, ఒడ్డున ఉన్న కొందరు దీనిని ఫోటోలు తీశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై రాబెర్టా ఉర్స్‌ రే మాట్లాడుతూ, తన కుటుంబం బతుకుతుందని ఊహించలేదని తెలిపింది. తమను రక్షించేందుకు చేతులు కలిపిన ప్రతిఒక్కరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వానికి ఇంతకన్నా నిదర్శనం ఏమీ ఉండదని పేర్కొంటున్నారు. మరికొందరు నెటిజన్లు...మనిషి తల్చుకుంటే దేనినైనా సాధించగలడనేందుకు ఇదే నిదర్శనం అని అభిప్రాయపడుతున్నారు.

More Telugu News