: గంటన్నర పాటు వేచివుండి కలెక్టర్ ప్రీతికి క్షమాపణలు చెప్పినా తప్పని అరెస్ట్... శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలన్న ఆలోచనలో కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆదేశించడంతో మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా ఇంటికి వెళ్లి, సుమారు గంటన్నర పాటు వేచివుండి, ఆమెకు బేషరతు క్షమాపణలు చెప్పి వచ్చినప్పటికీ, ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్టు తప్పలేదు. నిన్న రాత్రి మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌ లతో కలసి ప్రీతి ఇంటికి వెళ్లిన శంకర్ నాయక్, ఇద్దరు నేతలూ లోపలికెళ్లి కలెక్టరుతో సంప్రదిస్తుంటే, బయటే వేచి చూశారు. దాదాపు గంటన్నర తరువాత కబురు వస్తే, లోపలికి వెళ్లి, ఆమెను క్షమించాలని కోరి, పది నిమిషాల్లోనే బయటకు వచ్చారు.

ఇక కేసు తీవ్రత దృష్ట్యా వెంటనే లొంగిపోవాలని, లేకుంటే తామే స్వయంగా కల్పించుకోవాల్సి వస్తుందని, పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో ఈ ఉదయం స్టేషనుకు వెళ్లి లొంగిపోయారు శంకర్ నాయక్. ఆ వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. ప్రభుత్వంపై పడ్డ మచ్చను తొలగించుకునేందుకు ఆయన్ను సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను ఆయన సేకరిస్తున్నట్టు సమాచారం. కాగా, శంకర్ నాయక్ పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయగా, నేరం నిరూపితమైతే ఐదేళ్ల వరకూ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News