: విరాట్ కొహ్లీ జీతం అంత త‌క్కువా?

అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌తో పోల్చిన‌పుడు భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ జీతం చూస్తే `ఇంత త‌క్కువా?` అనిపిస్తుంది. అధికారికంగా వ‌చ్చే సంపాద‌న క‌న్నా ప్ర‌క‌ట‌న‌ల ద్వారా విరాట్ బాగా వెన‌కేస్తున్నాడు. ప్ర‌పంచవ్యాప్తంగా అత్య‌ధిక పారితోషికం అందుకునే 100 మంది క్రీడాకారుల జాబితాలో విరాట్ 89వ స్థానంలో వున్నట్టు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. ఈ జాబితాలో 69 మంది అమెరికా మేజ‌ర్ లీగ్ బేస్‌బాల్‌, నేష‌న‌ల్ ఫుట్‌బాల్ లీగ్‌ల‌కు చెందిన‌వారే. జ‌ట్టు ప‌రంగా పారితోషికం అందుకున్న‌పుడు అది త‌క్కువ‌గానే ఉండొచ్చు. దానికి ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం కూడా తోడైతే సంపాద‌న పెరిగే అవ‌కాశాలు ఉంటాయి.

టెన్నిస్ క్రీడాకారుడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌కి పారితోషికం కంటే ప్ర‌క‌ట‌న‌ల సంపాద‌నే ఎక్కువ‌. గోల్ఫ‌ర్‌ టైగ‌ర్ ఉడ్స్‌, స్ప్రింట‌ర్‌ ఉసైన్ బోల్ట్‌ల ప‌రిస్థితి కూడా అంతే. పారితోషికం ప‌రంగా ఉసైన్ బోల్ట్‌, టైగ‌ర్ ఉడ్స్‌ల క‌న్నా విరాట్ మెరుగే అయినా, సంపాద‌న విష‌యంలో మాత్రం వారితో చాలా భేదం క‌నిపిస్తోంది. మూడు మిలియ‌న్ డాలర్ల పారితోషికం, 19 మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంతో ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక క్రికెట‌ర్‌, ఏకైక భార‌తీయుడు విరాట్ కొహ్లీ. కెప్టెన్ ప‌రిస్థితే ఇలా ఉంటే మిగ‌తా ఆట‌గాళ్ల సంగతేంటో మ‌రి!

More Telugu News