: ఇకపై నన్ను ఆ విషయం గురించి అడగొద్దు.. ప్రభుత్వాన్నే అడగండి: మీడియాకు ముద్రగడ సూచన

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని మీటింగ్ పెట్టుకుంటే నేరమా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. హామీలను నెరవేర్చాలని అడిగితే అణచివేసే ప్రయత్నం చేస్తారా? అని అడిగారు. తామేమీ అరాచకాలకు, భూ కబ్జాలకు పాల్పడలేదని చెప్పారు. 15 లక్షల మంది 'కాపు సభ'కు హాజరయ్యారని... అందరినీ కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలని... అందరం కేసులను ఎదుర్కొంటామని తెలిపారు. జైల్లో పెట్టినా తాము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా తమ జాతి హక్కుల కోసం చేస్తున్న ఈ ఉద్యమం ఆగదని తెలిపారు. హక్కులు కేవలం మీకొక్కరికే కాదని, అందరికీ ఉంటాయని అన్నారు.

26వ తేదీన తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని... అది నిరవధిక పాదయాత్ర అని ముద్రగడ అన్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా తమ పాదయాత్ర ఆగదని... చావో రేవో ఏదేమైనా సరే అమరావతి యాత్రను పూర్తి చేస్తామని చెప్పారు. 13 జిల్లాల్లో ఉన్న తమ జాతి ప్రజలందరి మద్దతుతో యాత్ర కొనసాగుతుందని అన్నారు. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? అనే ప్రశ్నను ఇకపై తనను అడగవద్దని... ఈ ప్రశ్నను ప్రభుత్వాన్నే అడగాలని మీడియాకు ముద్రగడ సూచించారు.

More Telugu News