: చైనా వ్యూహమిది... మెల్లమెల్లగా అంతా కలిపేసుకుందాం!: అమెరికా విశ్లేషకులు

డోక్లామ్ ప్రాంతంలోకి చైనా సైనికులు జొరబడడం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందని అమెరికా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు వాస్తవాధీన రేఖకు దూరంగా ఉన్న చైనా సైన్యం ఒక్కసారిగా భూటాన్ సరిహద్దుల్లోకి చేరుకోవడం వెనుక భారీ కుట్ర దాగుందని, గతంలో చైనా వ్యూహాలను నిశితంగా గమనిస్తున్న నిపుణులు విశ్లేషిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో ముందుగా ఒక్కో ప్రాంతంలోకి చొరబడ్డ చైనా ఇప్పుడు మొత్తం సముద్రం తనదని, తన సముద్ర జలాల్లోకి ఎవరైనా వస్తే వారిని అరెస్టు చేస్తామని చెబుతూ, ఫిలిప్పీన్స్, జపాన్, మయన్మార్ దేశాలను భయకంపితులను చేస్తోందని, అదే వ్యూహాన్ని భూటాన్ పై చైనా ప్రయోగిస్తోందని ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ శాఖాధికారిగా వ్యవహరించిన అలీసా ఏరెస్ పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఆమె ‘కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌’లో భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాసియా వ్యవహారాల సీనియర్‌ ఫెలోగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భూటాన్ సరిహద్దుల్లో ఏర్పడ్డ పరిస్థితులపై స్పందిస్తూ, ‘‘దీనిపై భారత్‌ లో అనేక మంది తరహాలో నేనూ ఆందోళన చెందుతున్నా. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ప్రదర్శించిన రీతిలో ఇది కూడా చైనా వ్యూహంలో భాగమే... క్షేత్రస్థాయిలో అంగుళం అంగుళం చొప్పున కబళిస్తూ.. వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందాలన్నది చైనా ఎత్తుగడ’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

More Telugu News