: చైనా సరిహద్దులకు మరింత సైన్యాన్ని పంపిన భారత్!

డోక్లాం ప్రాంతంలోని ట్రై జంక్షన్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, చైనాను అడ్డుకోవాలనే నిర్ణయించుకున్న భారత్, మరిన్ని బలగాలను అక్కడికి పంపింది. చుంబీ లోయతో పాటు ఖంబా డీజాంగ్ ప్రాంతాల్లో చైనా అదనపు సైన్యాన్ని మోహరించిన వేళ, మరో 2,500 మంది సైనికులను అదే ప్రాంతానికి భారత్ తరలించింది. లడక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఉన్న 4,057 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖపై డోక్లాం సమీపంలో ఎన్నడూ లేనంత ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

గత నెల రోజులుగా ఇక్కడ భారత్, చైనా దళాలు మోహరించగా, ఇరు దేశాల మధ్యా వాగ్యుద్ధం జరుగుతోంది. డోక్లాం ప్రాంతంలో ఇరు దేశాల స్థానిక కమాండర్లు మాట్లాడుకుంటున్నారని, అయితే చర్చలు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని తెలుస్తోంది. కాగా, గ్యాంగ్ టాక్ లోని 17వ డివిజన్, కిలింపాంగ్ లోని 27వ డివిజన్, బిన్నాగురిలోని 20వ డివిజన్ సైనిక దళాల్లోని పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయగల విభాగాలను సరిహద్దులకు భారత్ తరలించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలోని 63, 112 బ్రిగేడ్లకు వీరు జత కానున్నారు.

More Telugu News