: చైనా ఆఫర్‌ను తిరస్కరించిన భూటాన్.. భారత్‌తో ఉండేందుకే మొగ్గు!

సిక్కిం సరిహద్దులోని డోక్లాం కారణంగా భారత్-చైనాల మధ్య ప్రారంభమైన గొడవ రోజురోజుకు ముదురుతున్నా భూటాన్ మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. అలాగని చైనాతో రాజీకి సిద్ధపడి, భారత్‌తో సంబంధాలను తెంచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే భారత్‌తో ఆ దేశానికి ఉన్న సంబంధాలు అటువంటివి. సమస్య పరిష్కారం కావాలంటే భారత్‌తో సంబంధాలు తెంచుకోవాలంటూ చైనా ఇచ్చిన ఆఫర్‌ను భూటాన్‌ తిరస్కరించింది. డోక్లాంలో చైనా నుంచి ప్రమాదం ఉండడంతో భారత్‌ను భూటాన్ విడిచిపెట్టే ప్రసక్తే లేదని భూటాన్ నిపుణుడు ఒకరు చెబుతున్నారు.
 
డోక్లాం సహా వివాదాస్పద ప్రాంతాన్ని చైనా తనదిగా చెప్పుకుంటే  హా, పారో, థింఫు లోయలు చైనా ఫిరంగుల లక్ష్యంలోకి వచ్చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు రాజధాని థింఫుకు దారితీసే రహదారిని చైనా ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. ఫలితంగా భారత్‌ నుంచి ఆహార సరఫరాకు ఉన్న ఒకే ఒక మార్గం మూతపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తూర్పు భూటాన్‌లోని 495 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ సెక్టార్‌లోని 286 చదరపు కిలోమీటర్లు తమవేనని చైనా వాదిస్తోంది. అయితే డోక్లాంను కనుక తమకు ఇచ్చేస్తే తూర్పు భూటాన్‌ను వదులుకోవడానికి తాము సిద్ధమని చైనా ఆఫర్ ఇచ్చింది. అదే జరిగితే చైనాకు భారత్‌పై ఆధిపత్యం చలాయించే అవకాశం లభిస్తుంది. అయితే చైనా ఆఫర్‌ను భూటాన్ అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఒకవేళ డోక్లాంను కనుక చైనాకు అప్పగిస్తే ఆ దేశ దళాలు భూటాన్‌లోని మరో ప్రాంతంలోకి చొరబడతాయని భూటాన్ భావిస్తోంది. ఇది మరింత ప్రమాదకరం కావడంతో భారత్‌తో ఉండేందుకే భూటాన్ సిద్ధపడుతోంది.

More Telugu News